బతుకు భయం భయంగా

నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా ! వద్దా ! వెళ్లితే ఏమౌతుంది! కొడ్తారేమో ! తన జీవితం నాశనం అవుతుంది !!! ఒక జీవితాన్ని నాశనం చేయవచ్చా?...వెళ్లకపోతే ఇంక ఎక్కడికి వెళ్లాలి ! నా వేదనని ఎవరికి చెప్పుకోవాలి? స్పర్శ సుఖాన్ని ఇస్తుందా?లేక దహిస్తుందా? గుండె కాలడమే నాకు తెలుసు! ఆ మంటలో నేను కాలిపోతూ ఉంటే...వాడికి అది సుఖమా? స్పర్శ సుఖాన్ని పొందే మానవ మృగాలు!!! చర్మం కాలుతున్న వాసన వారికి రాదా? వేలకొద్దీ ముల్లులు ఏకకాలంలో వళ్లంతా దిగబడినట్లు ఉంది !!! గునపంతో ఎక్కడో గట్టిగా పొడిచినట్లు ఉంది !! కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు!!! అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో! తాకుతారోనాని!

భారతదేశ చట్టాల ప్రకారం, ఒక అమ్మాయి అంగీకారం లేకుండా ఆమెని తాకి భయాన్ని కలిగించినప్పుడు IPC సెక్షన్ 354 A  ప్రకారం రెండు సంవత్సరాల నుంచి ఏడు  సంవత్సరాల వరకు వరకు జైలు శిక్ష ను పొందుతాడు. అలా అని తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో.

మృదువుగా తాకితే సుఖమా...అదెక్కడ? చర్మానికి ! మాంసానికి! కలిగేది దుఃఖము మాత్రమేనని స్పర్శ తో అని వానికి తెలియదా!!! తెలిసి చేశారా? తెలియక చేశారా? ఆడపిల్ల బాధ తెలిసి ఉంటే చేసేవారా? తెలిసి చేసి తమాషా చూశారా? అమ్మాయి మనస్సు లోలోతుల్లో కలిగే గాయం మంట పుట్టించదా? గాయం ఎక్కడ అంటే, గాయం గుండెల్లో, మంట ఒళ్లంతా అంటే విప్పి చూపిమంటారా? 

భారతదేశ చట్టాల ప్రకారం, ఆమె అంగీకారం లేకుండా ఆమెను నగ్నంగా మారమని బలవంతం చేసినప్పుడు సెక్షన్ 354B ప్రకారం  ప్రకారం అతను మూడు సంవత్సరాల  నుంచి ఏడు  సంవత్సరాల వరకు వరకు జైలు శిక్ష ను పొందుతాడు. చట్టానికి కళ్లు ఉన్నాయి అందుకే ఈ శిక్ష భ్రష్టులకు.

అమ్మకి చెప్పాలా! వింటుందా! నమ్ముతుందా!లేక నీదే తప్పంటుందా! నువ్వు ఏమి చేసావో...నువ్వు ఏమి చేసి ఉండకపోతే అలా ఎలా అవుతుంది...అంటుందా? లేక నేనేమి చేసేది అని జారుకుంటుందా! నాన్నకి చెబుదామా! ఏమంటాడో! నేనున్నాను అంటాడా? బయట అడుగు పెట్టవద్దంటాడా? ఎక్కడికైనా పద, నేను తోడుంటాను అంటే ఎంత బాగుంటుందో! 

మంచి బట్టలు వేసుకోవడం కూడా తప్పేనా? అది కూడా ఆకర్షించడమేనా! ఆకర్షణ ఉండటం కూడా తప్పేనా? అప్పుడు ఆకర్షణ తో పుట్టించిన భగవంతుడిని అడగాలి...నా తప్పు ఏముంది అని! నవ్వుతూ మాట్లాడటం కూడా తప్పేనా? నవ్వు లేకపోతే పొగరంటారు...నవ్వుతూ ఉంటే కొవ్వంటారు! మాట్లాడకూడదా? మాట్లాడితే ఎదురు మాట్లాడావు అంటారు! దేవుడు శిక్ష వేస్తాడా! లేక నేను శిక్షించాలా? ఇంట్లో ఉండకుండా బయటకు ఎందుకొచ్చారు అంటారా? వళ్ళు చూపకుండా ముసుగు వేసుకోమంటారా? వేళ్ళు , పాదాలు వాటికి కూడా ముసుగు వేయాలా? అవి కూడా ఆకరిస్తాయి కదా!!! కళ్లకు కూడా ముసుగు వెయ్యలా? అవి నిజాన్ని చెబుతాయి కదా!!! కళ్ళలో ఏముంది? కళ్ళు చూసి మోహిస్తారా? కండ్లు కలలు కదా కంటాయి! కానీ వాడికి కండ్లల్లో కోరికలు కనిపిస్తాయి అంతే!!! వాడు ఇటు చూడు అన్నప్పుడు...అది కూడా నా మొహంలోకి ఇటు నా కళ్ళలోకి అన్నప్పుడు..ఏమి చేయాలి? పారిపోవాలా అక్కడ నుండి! లేక ఎదుర్కోవాలో? ఎదుర్కోవాలి అంటే ఏ ఆయుధం ధరించాలి? నిజమైన ప్రేమ? లేక కపట ప్రేమా? 

భారతదేశ చట్టాల ప్రకారం, అమె వైపు అదేపనిగా అసురక్షితంగా చూస్తూ ఉన్నప్పుడు IPC సెక్షన్ 354D  ప్రకారం అతను మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు. తప్పు చేసిన వారిని శిక్షించడ్డనికి చట్టం తన పని తాను చేసుకుని పోతుంది.   

భయం భయంగా బతకాల్సినదేనా! అడుగు తీసి అడుగు వేయాలంటే చుట్టూ చూడాల్సిందే! ఎక్కడైనా షాప్ కి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకోవాలన్నా భయమే, ఎక్కడ కెమెరా  పెట్టారో అని. భారతదేశ చట్టాల ప్రకారం, ఆమెను చూడకూడని ప్రదేశాలలో ఆమెను చూస్తూ ఆమె ఫోటోలు తీసినప్పుడు సెక్షన్ 354C   voyeurism ప్రకారం  అతను ఒక సంవత్సరం  నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు అని తెలుసా ఈ మూర్ఖులకు  .

ఎవ్వరు ఎప్పుడు ముట్టుకుంటారో? ఎక్కడ తాకుతారో? ఎవ్వరైనా తాకారో, అగ్నిశిఖలు ఎగిరెగిరి పడి కాలుస్తూ ఉంటే,ఆ జ్వాల లో నేను కాలిపోతూ, ఎవ్వరిని దహించాలో తెలియక నన్ను నేను దహించుకుంటున్నా? హోళీ వస్తె చాలు హోలికాసురులు తయారవుతారు...కన్ను మూసి తెరిచేంతలో వద్దు వద్దంటున్నా  ఎక్కడంటే అక్కడ తాకుతూ రంగులతో నింపేస్తారు...చున్నీ పట్టుకుని లాగుతారు...వానికి రాక్షస అనుభూతి!!! స్పర్శ సుఖాన్ని ఇస్తుందా?లేక దహిస్తుందా? గుండె కాలడమే నాకు తెలుసు! ఆ మంటలో నేను కాలిపోతూ ఉంటే...వాడికి అది సుఖమా? స్పర్శ సుఖాన్ని పొందే మానవ మృగాలు!!! చర్మం కాలుతున్న వాసన వారికి రాదా?

భారతదేశ చట్టాల ప్రకారం, ఆమె చున్నీ పట్టుకుని ప్రయత్నపూరితంగా లాగినప్పుడు IPC సెక్షన్ 350  ప్రకారం అతను మూడు సంవత్సరాల నుంచి ఏడు  సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు. విష్ణు చక్రం లా చట్టం హొలికాసురులనును దగ్నం చేస్తుంది.
 
చదువు సరే సరి! సంపాదన కోసం అడుగు బయట పెడితే! ఒకరంటారు ఇంట్లో జరుగుబాటు లేదేమో? కళ్ళతో సైగలు చేస్తూ మన వైపు చూపిస్తూ....వస్తావా...రెండు జీతాలు.....ఇంకోకరు!!! అవసరమా?  నడుస్తుంటే కాలు అడ్డం పెడతారా! పడితే వాడి ఒడిలో పడాలని! అందరి కళ్ళముందు మనం వాడి కోసం పడినట్లు ఉండాలని...పడ్డామే అనుకో! ఏమి తెలియనట్లు అరే పడ్డావా అంటూ వళ్ళంతా తడమాలని!!! చేతులు అడ్డుపెడతారు నడుస్తూ ఉంటే...మనం పడలేదని!!! లొంగదీయాలని? లోంగితే! ఇక లోకువ ! లొంగామే అనుకో! అది ప్రేమ అనుకొన్నామే అనుకో? వాడిని మనమే ఆకర్షించినట్టు? వళ్ళు కొవ్వెక్కింది అంటారు వేరెవ్వరో? నిలబడ్డామే అనుకో ప్రేమ కోసం...ఏదో సుఖం కోసం అంటారు? పారిపోయామా...మోసం చేసామంటారు? పారిపోయామని వదిలేశామని వేధింపులకు గురి  చేస్తూ అంతర్జాలంలో పెడతారు. అందరికీ వాట్సప్ లో సందేశం పెడతారు. మెయిల్ ఇస్తారు తెలిసిన వారికి తెలియని వారికి మన గురించి తప్పు తప్పుగా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్  లో పోస్ట్ చేస్తారు మన మార్ఫెడ్ ఫోటోలు.

భారతదేశ చట్టాల ప్రకారం, పని ప్రదేశాలలో కాని మరెక్కడైనా  కానీ శృంగార పూర్వకంగా ఆమెను రమ్మని పిలిచినప్పుడు సెక్షన్ 354A, 509  ప్రకారం అతను మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు.  POSH act ప్రకారం అతను మూడు సంవత్సరాల నుంచి ఏడు  సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు. చట్టం శిక్షిస్తుంది.

ఆఖరికి ఇంట్లో కూడా రక్షణ లేదా? నీడని కూడా నమ్మలేమా? మంచి నిద్రలో ఉన్నప్పుడు పైన ఏదో బరువు? ఎవ్వరది? కదిలితే కదిలింది? కళ్లు తెరచి చూద్దుము కదా అది పడగ నీడ? అవమానాన్ని దాచుకుని బతకాల్సినదేనా? బయటపడ్డామే అనుకో మరిన్ని అవమానాలు! చేతులు కూడా వేస్తారేమో? బతుకు భయం భయంగా?

భారతదేశ చట్టాల ప్రకారం, కుటుంబంలో వ్యక్తుల వలన ఆమె వేధింపులకు గురి అయినప్పుడు సెక్షన్ 354 IPC ప్రకారం శిక్షించదగిన వ్యక్తి,  రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు. ప్రతి శిక్ష కు అదనంగా జరిమానా ఉంటుంది. సమాజంలో గౌరవంగా బతకాలని లేని వాళ్ళు మాత్రమే తప్పు చేస్తారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ