దారి తప్పిన పడుచు
మా మేనత్త జయమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం... బారెడు జడ...చారెడు కండ్లు...నవ్వుతుంటే పలువరుస నక్షత్రాలను తలపించేది.అందరూ అనేవాళ్ళు నీలమ్మ నీకు మీ మేనత్త పోలికలు వచ్చాయి అని. నాకు దగ్గర ఉండి స్నానం చేపించేది. తలకు నూనె బాగా పట్టించి జడలు వేసేది. నా చిన్నతనంలో అమ్మ దగ్గర కంటే అత్త దగ్గర ఎక్కువగా ఉండేదాన్ని. రాత్రిళ్ళు కథలు చెప్తూ నిద్రపుచ్చేది. నాకు పూల జడ వేసి మా యమ్మ నీలమ్మ...నీ అందం చందం ఎవ్వరికీ రాదే అంటూ మెటికలు విరుస్తూ దిష్టి తీసేది. చమ్మ చక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేసి రత్నాల చెమ్మ చెక్క రంగులేసి ....అంటూ ఆడుకునేదాన్ని నేను మా అత్తమ్మ ఇద్దరం. గోళీలాట, కబడ్డీ, క్రికెట్, కోకో, ఒకటేమిటి అన్ని ఆటలు ఆడేవాళ్ళము. మా అత్తమ్మ వీధిలో పిల్లలందరిని పోగేసేది ఆటలకు. అప్పటికి మా అమ్మ అరుస్తూ ఉండేది ఏంటే మీకు మగ పిల్లల ఆటలు. కొంచెం సద్దుగా ఉండండి అని. మేము వింటేనా... నవ్వుకుంటూ అలాగే అంటూ మా ఆటలు మావి. మా అమ్మ మాటలు ఆమెవి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళము నేను మా అత్త పోటీ పడి. రంగుల ముగ్గులతో మా వీధి ...